శ్రీ నృసింహ హారతి
భక్తి మార్గంలో అడ్డంకులను తొలగించి రక్షించమని భగవాన్ శ్రీ నరసింహస్వామిని వేడుకునే అద్భుత ప్రార్థన.
కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారికి కృతజ్ఞతలతో.
సంస్కృత శ్లోకాలు
శ్లోకం 1
నమస్ తే నరసింహాయ / ప్రహ్లాదాహ్లాద-దాయినే । హిరణ్యకశిపోర్ వక్షః / శిలా-టంక-నఖాలయే ॥
భావం: భక్త ప్రహ్లాదునికి అమితమైన ఆనందాన్ని ఇచ్చేవారు, రాతిలాంటి కఠినమైన హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని ఉలి వలె చీల్చినవాడు అయిన శ్రీ నరసింహస్వామివారికి నా నమస్కారములు.
శ్లోకం 2
ఇతో నృసింహః పరతో నృసింహో / యతో యతో యామి తతో నృసింహః । బహిర్ నృసింహో హృదయే నృసింహో / నృసింహమ్ ఆదిం శరణం ప్రపద్యే ॥
భావం: నృసింహస్వామి ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్లినా అక్కడ శ్రీ నరసింహస్వామి ఉంటారు. ఆయన బయట మరియు నా హృదయంలోపల కూడా ఉన్నారు. ఆ ఆది దేవుడైన శ్రీ నరసింహస్వామి పాదాలను నేను శరణు వేడుకుంటున్నాను.
శ్లోకం 3
తవ కర-కమల-వరే నఖమ్ అద్భుత-శృంగం / దలిత-హిరణ్యకశిపు-తను-భృంగమ్ । కేశవ ధృత-నరహరి-రూప జయ జగదీశ హరే ॥
భావం: ఓ దేవాదినాథా! నరహరి రూపాన్ని ధరించిన ఓ కేశవా! జగదీశ్వరా! నీకు జయం కలుగుగాక. మనిషి తన చేతితో ఒక తుమ్మెదను చిదిమేసినట్లుగా, నీవు నీ కమలముల వంటి చేతులకి ఉన్న వాడియైన గోళ్ళతో ఆ హిరణ్యకశిపుని శరీరాన్ని అవలీలగా చీల్చివేశావు.



